Followers

Monday, April 8, 2019

అసలు మహాభారత యుద్ధం లో శ్రీ కృష్ణుడు ఏమి చేశాడు

*శ్రీకృష్ణుడు - అస్త్ర విద్య :

భౌతికమైన చరిత్ర, వైజ్ఞానిక అభివృద్ధి గురించి మనం పెద్దగా చర్చించుకోనవసరం లేదు......వాటిని మనం అనుదిన శాస్త్రాలలో నిత్యం చదువుతున్నాం కదా! అయితే "శ్రీకృష్ణుడు" చేసిన గొప్ప పనులు మనం ఇంకా గుర్తించ లేదని అనిపిస్తోంది. "శ్రీ కృష్ణుడు" చేసిన గొప్ప పని ఏమిటంటే "అస్త్ర విద్య"అనేది లేకుండా చేసేసాడు. మనం మహాభారతాన్ని విశ్లేషణాత్మకంగా చదివితే,అర్ధం అవుతుంది. శ్రీకృష్ణుడు తరువాత అస్త్ర విద్య లేదు. శస్త్ర విద్య మాత్రమే ఉంది. ఈనాడు శాస్త్ర విజ్ఞానం "శస్త్ర విద్య"లో పరాకాష్టకు వెళుతోంది. శస్త్ర విద్యలో జడ పదార్ధాన్ని ఉపయోగించి.....మారణ హోమం చేయడంలో "ఆటమిక్ ఎనర్జీ" ఉన్నత మైనది. అయితే ఈ అస్త్రవిద్య ఉంటే...ఈ ఆటమిక్ ఎనర్జీ కూడా ఎందుకూ పనికి రాదు...అని శాస్త్రవేత్తలు చెబుతారు.

     ఇక్కడ మనం, శ్రీ కృష్ణుడిని...జగద్గురువు అని ఎందుకు అంటున్నామంటే, మహాభారత కాలంలో ఈ "అస్త్ర విద్య" చాలా ప్రాదుర్భావం చెందినపుడు, *అస్త్ర విద్య తెలిసిన, వ్యక్తులందరినీ ఒక చోటుకు తీసుకు వచ్చో 18 రోజుల్లో వారినందరినీ సంహరింపజేసాడు.*

     ప్రపంచాన్నేమీ చెయ్యలేదు శ్రీ కృష్ణుడు. అస్త్రవిద్య లేకుండా చేసేసాడు.అస్త్ర విద్య *కీలితం* కాబడింది. అంటే ఏమిటి? అస్త్రవిద్య గురించి మనకు అంతా తెలిసినప్పటికీ...మనం దానిని ఉపయోగించుకోలేం.

   *కీలితం చెయ్యడం తప్ప , విద్యను నాశనం చేయలేదు. నాశనం చేయడం, గురు సాంప్రదాయం కాదు. ఈ "అస్త్ర విద్య" ఉన్నత స్థాయికి చెందిన విజ్ఞాన శాస్త్రం.*

     ఒక వైపు అస్త్ర విద్యను, నాశనం చేస్తూనే...రెండవవైపు, అర్హత కలిగిన వాడికి, అస్త్రవిద్య ఎలా పలికించుకోవాలో...తెలుపడానికి మహాభారత యుద్ధం అందించాడు.

*"యథేచ్చసి తథాకురు"* అన్నాడు....అర్జునినితో....అస్త్ర విద్యను కీలితం చేసిన తర్వాత,తన నిర్యాణ సమయంలో....ఈ విద్యను మరల ఎవరికైనా అందించాలి. ఎవరు లభిస్తారు? ఏం చెయ్యాలి? అంతటి మేధాశక్తి సంపన్నత కలిగిన వారెవ్వరు?అన్న ప్రశ్నలకు, ఆయన నిర్యాణం చెందేసమయంలో....ఒకరు మైత్రేయ మహర్షి, పరిస్థితుల ప్రోద్బలం వలన ఉద్ధవుడు ఉన్నారు. మహా భారత యుద్ధంలో...ఉద్ధవుడు, మహారథి. అస్త్ర విద్యలో నిష్ణాతుడు. కానీ శ్రీకృష్ణుడు అస్త్ర విద్యను ఉపయోగించవద్దని చెప్పడం వలన....అతను ఉపయోగించడని, శ్రీకృష్ణుని నమ్మకం.

*అస్త్ర విద్య అంటే ఏమిటి?*

అస్త్ర విద్య అంటే, వాక్కుద్వారా పని సాధించడం. ఇక్కడ వాక్కుకూ, మనస్సుకూ సంబంధం ఉంది.ఒక విధంగా ఈ రోజు అనుదిన వ్యవహారాల్లో " వాక్ శక్తి" ని ఉపయోగించుకుంటున్నాం కదా!అయితే ఇది అస్త్ర విద్య స్థాయిలో లేనటువంటి చిన్న మాటలు. అస్త్ర విద్య అంటే అతి తీవ్రమైన, అత్యధిక ఫ్రీక్వెన్సీ గల వాక్ శక్తి. ఈనాడు యంత్రాలతో చేస్తున్న చమత్కారాలన్నీ...ఆనాడు, వాక్కుతోనే జరిగి పోయేవి. వాక్ శక్తి యొక్క , సార్వజనీన ప్రయోగాన్ని, అరికట్టకపోతే...జీవితం (life principle) యొక్క, స్పర్శా అవ్యక్త మనోమయ పరిధి నుండి, స్థూల జగత్తుకు దిగలేదు. అందువల్ల అస్త్రవిద్యను కీలితం చేయవలసి వచ్చింది. దీని గూర్చి అవగాహన కోసం *"భగవద్గీత నందలి రాజవిద్య-రాజగుహ్యం"* చదువగలరు.

   శ్రీకృష్ణుడు, శరీరం వదలినప్పటి నుండి...ఇప్పటి వరకు...హిమాలయాలలో  *సత్రయాగం* జరుగుతోంది. ఈ సత్రయాగం జరుగుతున్న చోట, వాళ్ళేం చేస్తున్నారు? ఎక్కడెక్కడ మానవ జాతి అస్త్రవిద్యను మరచిపోయిందో...అక్కడ ఒక మహాపురుషుణ్ణి పుట్టించి ఈ విద్య నాశనం అయిపోకుండా చూస్తున్నారు.


విశ్వమంతా శివ తాండవం

*The Cosmic Dance of Shiva* -




*విశ్వమంతా శివ తాండవం*


“ ఈ విశ్వం అనంతంగా పుడుతూ, నాశనమవుతూ ఉంటుందని చెప్పిన ఏకైక ప్రాచీన ధర్మం హిందూ ధర్మం మాత్రమే. విశ్వం పుట్టుకకు సంబంధించి వీరి కాలగణన నేటి ఆధునిక కాస్మోలజీ వేస్తున్న లెక్కలకు చాలా దగ్గరగా ఉంది. వారు బ్రహ్మ యొక్క ఒక పగలు, రాత్రి కలిపి 8.64 బిలియన్ సంవత్సరాలని చెప్పారు. ఇది ఆధునిక ఖగోళ శాస్త్ర అంచనాలకు దగ్గరగా ఉంది.”  -  కార్ల్ సాగన్, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త.


జూన్ 18, 2004 వ తేదీన జెనీవాలోని 'సెర్న్' (యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్) పరిశోధనాలయం వద్ద రెండు మీటర్ల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిశోధన కేంద్రంతో ఉన్న అనుబంధం దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ‘సెర్న్’ కు బహుకరించింది.
ఒక లౌకిక వాద ప్రభుత్వం శివ విగ్రహాన్ని బహూకరించడం, శాస్త్రవేత్తలు దానిని తమ ఆవరణలో ప్రతిష్ఠించుకోవడం వెనుక సుస్పష్టమైన తాత్త్వికత, శాస్త్రీయ దృష్టి గమనార్హం. సెర్న్ పరిశోధన కేంద్రంలో పరమాణు కణాలపై పరిశోధన జరుగుతోంది. పరమాణువులోని సూక్ష్మ అంశాలు నిరంతరం జరిపే శక్తి తాండవానికి ప్రతిరూపంగా నటరాజ రూపంలో జరిగే శివతాండవం మన భావనకు అందుతుంది.
సెర్న్ కేంద్రంలోని “లార్జ్ హాడ్రాన్  కొలైడర్” అనే భారీ పరికరం సహాయంతో శాస్త్రవేత్తలు “దైవ కణం” (హిగ్స్ బోసాన్) ఉనికిని గుర్తించారు. ఉప పరమాణు కణాలు, పరమాణువులు, అణువులు - వీటన్నింటికీ ద్రవ్యరాశినిచ్చేదే ఈ ‘దైవ కణం’ లేదా ‘హిగ్స్-బోసాన్ కణం’.

1972లో ఫ్రిట్జఫ్ కాప్రా అనే భౌతిక శాస్త్రవేత్త ఒక పత్రికలో వ్రాసిన వ్యాసంలో మొదటిసారిగా ఉపపరమాణు కణాల శక్తి తాండవాలను శివతాండవంతో పోల్చాడు.  ఆ తర్వాత తను వ్రాసిన “ద తావో ఆఫ్ ఫిజిక్స్ (the tao of physics)”  అనే ప్రఖ్యాత గ్రంథంలో ఈ విషయాన్ని మరింత వివరించాడు. ఈ విషయాలను  శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తన "విజ్ఞాన వీచికలు" అనే గ్రంథంలో పొందుపరిచారు.


సెర్న్ లో నటరాజ విగ్రహం క్రింద ఫలకం మీద ఫ్రిట్జఫ్ కాప్రా మాటలను ఉల్లేఖించారు.

*"వందల సంవత్సరాల క్రితమే భారతీయ కళాకారులు నాట్యం చేస్తున్న శివుని కంచు విగ్రహాలను తయారు చేశారు. మన కాలంలో భౌతిక శాస్త్రవేత్తలు ‘కాస్మిక్ డ్యాన్స్’ ని వర్ణించడానికి అత్యాధునిక సాంకేతికతను వాడారు. ఈ ‘కాస్మిక్ నృత్యం’ అనే రూపకాలంకారం ప్రాచీన పురాణాలను, మతపరమైన కళారూపాలను ఆధునిక భౌతిక శాస్త్రంతో  సమన్వయం చేస్తోంది. ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం జనన మరణాలు జీవులకే కాక, జీవం లేని వాటికి కూడా ఉంటాయి. కాబట్టి, ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు శివ తాండవమంటే ఉపపరమాణు కణాల తాండవమే.”*

ఏతావాతా శివతాండవం సర్వ ప్రాణుల, జడ పదార్థాల జనన మరణాలు, సృష్టిలయాలకు సంకేతం. భరత నాట్య కళారూపంలో రంగస్థలం మీద మనం చూసే శివతాండవం దానికి కేవల రసాత్మక ఆవిష్కరణ.  దీనిని *ఫ్రిట్జఫ్ కాప్రా* ఎంతో హృద్యంగా వర్ణించారు.
*“నటరాజ భంగిమలో డమరుకాన్ని పట్టుకున్న హస్తం సృష్టికి ఆధారమైన శబ్దాన్ని సూచిస్తుంది.”
“ఎడమ చేతిలోని అగ్ని వినాశనాన్ని అంటే ప్రళయాన్ని సూచిస్తుంది.  ఆ రెండు చేతులూ ఒకే రీతిగా ఉండడం ఈ ప్రపంచంలో సృష్టి వినాశాలు ఎప్పుడూ సమానంగా కొనసాగుతాయని తెలుపుతుంది.”
“రెండు బాహువుల మధ్య ఉన్న నిర్వికారమైన నటరాజు ముఖం సృష్టి వినాశనాలు రెండింటినీ సమన్వయించుకున్న, ఆ రెండిటికీ అతీతమైన స్థితిని సూచిస్తుంది.”
“నటరాజు కుడి పక్కన ఉన్న రెండో బాహువు అభయ ముద్ర ద్వారా స్థితి, పాలనలను సూచిస్తుంది.  ఎడమ ప్రక్కన ఉన్న రెండో బాహువు పైకెత్తిన ఆయన పాదాన్ని చూపుతూ మాయాజాలం నుంచి విముక్తిని సూచిస్తుంది.”
నటరాజు ఒక రాక్షసుడి దేహంపై నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు మానవునిలోని అజ్ఞానానికి ప్రతిరూపం. దానిని నశింపజేస్తేనే ముక్తి సాధ్యం.
శివుడి “ఆనంద తాండవం” లేదా “లాస్యం” - ప్రళయం తర్వాత తిరిగి జగత్తు యొక్క సృష్టిని సూచిస్తుంది.  శివుడు పరబ్రహ్మానికి సంకేతం. అతడి మెడలోని సర్పం ప్రతీ జీవుడిలో ఉండే కుండలినీ శక్తికి సంకేతం. వెన్నులోని ఏడు చక్రాలను మేల్కొల్పడమే కుండలినీ శక్తిని మేల్కొల్పడం. శివుడి 'రుద్ర తాండవం' ఈ జగత్తు నాశనానికి సంకేతం.
శివుని అర్థ నారీశ్వర తత్వం సృష్టిలోని స్త్రీత్వ, పురుషత్వాలకు సంకేతం.
శివుడి మూడో కన్ను జ్ఞానానికి సంకేతం.
చేతిలోని పుర్రె మృత్యువుపై విజయానికి సంకేతం.
దట్టమైన శివుని జటాజూటం ప్రళయకాలంలో అన్ని వైపులా వ్యాపించి  తుఫానులు,సునామీల వంటి ఉత్పాతాలను సృష్టిస్తుంది. శివుడు మూడో నేత్రం తెరవడంతో దాని నుంచి వెలువడే అగ్నిశిఖలు విశ్వమంతా దావానలంలా వ్యాపించి, దానిని నాశనం చేస్తాయి.
శివుడి ఈ రెండు తాండవాలు నిరంతరం జరుగుతూనే  ఉంటాయి. శివుడి ఈ రెండు రకాల నృత్యాలు 'చిదంబరం' అంటే - హృదయమనే ఆకాశంలో - అంటే చైతన్యానికి కేంద్రమైన చిదాకాశంలో జరుగుతాయి.

పరబ్రహ్మ స్వరూపుడైన శివుడు సర్వరూపాల్లోనూ ఉంటాడు కాబట్టి, తాండవం చేసే విశ్వమే శివుడు. ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు ఈ తాండవం నిత్యమూ జరిగేదే. శివతాండవం బ్రహ్మాండాల సృష్టి లయాలకే కాక, నిత్యమూ కొనసాగే జనన మరణాల వంటి ప్రకృతి క్రియలకు కూడా సంకేతం.

వివిధ రూపాలుగా మనకు కనిపించేదంతా నిజానికి అశాశ్వతం, భ్రాంతి మాత్రమేనని శివుడు సదా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు.  బ్రహ్మ రాత్రిని అనుభవించినప్పుడు ప్రకృతి అచేతనంగా ఉంటుంది.  శివుడు సంకల్పించేంత వరకు ప్రకృతి నృత్యం చేయజాలదు. ఆయన ఆత్మానందం నుంచి మేలుకొని, తన నృత్యం ద్వారా జడమైన ప్రకృతిని మేల్కొలిపేలా శబ్దం (డమరుక ధ్వనిగా సూచితం) చేస్తాడు. ఇలా తన నృత్యం ద్వారా పదార్థ రూపంలో వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తాడు. కాలాంతరంలో ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలనింటినీ నశింపజేసి, ప్రకృతికి విశ్రాంతినిస్తాడు. ఇదంతా కవిత్వంగా మురిపించే ఆధునిక విజ్ఞానం.
బ్రహ్మకు రాత్రి అయి నిద్రలోకి వెళ్ళినపుడు శివుడు రుద్ర తాండవం మొదలుపెడతాడు.  అప్పుడు ఈ విశ్వం నాశనమై, కుంచించుకు పోయి, శూన్య స్థితికి చేరుతుంది. బ్రహ్మకు పగలు అయి, మేలుకున్నప్పుడు శివుడు ఆనంద తాండవం మొదలుపెడతాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు.

సృష్టి అయిన దానిని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే అందులో నుండి అఖండమైన శక్తి వెలువడుతుంది. ఐన్ స్టీన్ తన E=mc2 సమీకరణం ద్వారా ద్రవ్యరాశి - శక్తుల పరస్పర సంబంధాన్ని తెలియజేశాడు. శివ తాండవంలో కూడా ఈ భావన కనబడుతుంది.

బ్రహ్మం తన లీల కోసం ఈ జగత్తుగా రూపొంది, తిరిగి ఏకత్వాన్ని పొందుతుందని భగవద్గీత చెబుతుంది. (9:7-10)

"దేనినుండి తను ఉద్భవించాడో, దేనిలో తిరిగి లయిస్తాడో, దేనిలో ఇప్పుడు జీవిస్తున్నాడో అట్టిది బ్రహ్మమని తలచి దానిని అతడు ఆరాధించుగాక " అని ఛాందోగ్యోపనిషత్తు  (3:14:1) చెబుతుంది.

పరమాణువులలో సూక్ష్మ స్థాయిలో జరిగే మార్పులు కూర్పు, లయ, తాళాలతో ఉండడం వల్ల ఆధునిక శాస్త్రవేత్తలు వాటిని తాండవంతో పోల్చారు.  విశ్వమంతా శక్తి తాండవమే. ఇలా అనుక్షణమూ తాండవిస్తూ ఉండే పరమాణువుల సమూహాలే వస్తువులన్నీ.  ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం ఉప పరమాణు కణాలు అనుక్షణమూ ఉత్పన్నమవుతూ, నశిస్తూ ఉంటాయి. అంటే అనుక్షణమూ ఇవి సృష్టి లయాలను తాండవం చేస్తూ ఉంటాయి.
కెన్నెత్ ఫోర్డ్ తన రచన “ద వరల్డ్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్” లో ఇలా అంటారు : “ప్రతి ప్రోటాన్ అప్పుడప్పుడు ఇలాంటి సృష్టిలయాలనే తాండవం చేస్తుంది.”

ఫ్రిట్జఫ్ కాప్రా (fritze of Capra) ఇలా లోతుగా మరో సంగతి చెబుతారు: “పరమాణువులోని ప్రతి కణము శక్తి నృత్యం చేయడమే కాదు.  దానికదే ఒక శక్తి నృత్యం కూడా. అది అంతు లేకుండా సాగే సృష్టి, నాశనాల క్రమాన్ని సూచిస్తుంది.  ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు శివతాండవమంటే ఉపపరమాణు కణాల తాండవమే.”

పరమాణువులోని ఈ తాడనాల వల్ల శబ్ద తరంగాలు పుడతాయి.  ఆ నృత్య క్రమం మారితే అక్కడ వెలువడే శబ్దం కూడా మారుతుంది.  ఈ శబ్దమే అనుక్షణమూ స్థూలమూ, సూక్ష్మమూ  అయిన రూపాలను ఉత్పన్నం చేస్తుంది.  క్షేత్ర సిద్ధాంతం ప్రకారం ప్రతి కణమూ దాని సంగీతమది పాడుతూ ఉంటుంది.

శబ్దమే (ఓంకారం) బ్రహ్మమని, అదే సృష్టి, స్థితి, లయాలకు కారణమని హిందూ మత గ్రంథాలు చెప్పిన దానికి నేటి భౌతిక శాస్త్రం చెబుతున్న అంశాలు చాలా దగ్గరలో ఉన్నాయి.
అమెరికాకి చెందిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ తన రచన “కాస్మోస్” లో నటరాజు తాండవం ఈ విశ్వం యొక్క అనంతమైన సృష్టి, వినాశనాలను సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. తన ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ టీవీ సీరియల్ “కాస్మోస్” ను చిత్రీకరించడానికి ఆయన తమిళనాడులోని చోళుల కాలం నాటి ఆలయాలను ఎంచుకున్నారు. చోళుల కాలంలో భారతదేశంలో క్రీ.శ. 880-1270 మధ్య కాలంలో నటరాజ కాంస్య విగ్రహాలు తయారయ్యాయి. తన టీవీ షో లో అక్కడి నటరాజ కాంస్య విగ్రహాన్ని చూపుతూ అది ఈ విశ్వం యొక్క సృష్టి వినాశనాలకు సంకేతంగా ఉందని వివరించాడు.  కాప్రా చెప్పినట్లు “శివతాండవమంటే ఈ విశ్వ తాండవమే. అది అనంతమైన రీతుల్లో సాగే అలుపెరుగని శక్తి ప్రవాహం.”---

విజ్ఞాన భైరవ తంత్రం

విజ్ఞాన భైరవ తంత్రం :


  ప్రపంచం లోని అత్యుత్తమ ధ్యాన సాహిత్యం లో *రుద్ర యామళ తంత్రం* లో భాగమైన *విజ్ఞాన భైరవ తంత్రం* ఒకటి. దీనిమీద చాలా మంది ఇప్పటికే వ్యాఖ్యానించి ఉన్నారు. ఓషో రజనీష్ గారు దీనిపైన ఇచ్చిన ఉపన్యాసాలు *"The Book of Secrets"* అనే పేరుతో పబ్లిష్ అయి అమెరికాలో మూడు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించింది.

ఇటువంటి తంత్ర గ్రంధాలు ఎన్నో మూర్ఖులు,హింసా వాదుల దండ యాత్రలలో నాశనం అయ్యాయి. నలందా విశ్వ విద్యాలయం తగులబెట్టి నపుడు కొన్ని లక్షల విలువైన రీసెర్చి పుస్తకాలు నాశనం అయ్యాయి.  నెలల పాటు ఆ లైబ్రరీ తగులబడుతూనే ఉందంటే... ఎన్ని లక్షల విలువైన పుస్తకాలు అందులో భస్మం అయ్యాయో ఊహించుకోవచ్చు. ఆ జ్ఞానంతరువాత తరాలకు అందకుండా మాయం అయ్యింది.

 *Witch Hunt* పేరుతో మధ్య యుగాలలో ఎందఱో మార్మిక విజ్ఞాన ఖనులైన వనితలను , యోగులను,తాంత్రికులను , మంత్రగాండ్రు అనే పేరుతో పైశాచికంగా సజీవ దహనం చేసారు, కొంత మంది మూర్ఖ ధర్మాల వారు.

అలా దాడులలో నాశనం కాగా మిగిలిన అతి కొద్ది తంత్ర గ్రంధాలలో ఇదీ ఒకటి. ఈ ప్రక్రియల లోతునీ, అర్థ బాహుళ్యాన్నీ పరిశీలిస్తే మన దేశపు విజ్ఞానం ఎంతటి ఉన్నతమో అర్థం అవుతుంది. నాశనం అయి మనకు అందకుండా పోయినవిజ్ఞాన సంపదను తలుచుకుంటే భారతీయుని గా పుట్టిన ప్రతివానికీ కన్నీరు కారుతుంది. ఇటువంటి మతాలు మనకు ఏదో నేర్పాలని చూడటం వింతల్లో వింత. తాతకు దగ్గులు నేర్పటం లాంటిది.

విజ్ఞాన భైరవ తంత్రం లో శివుడు శక్తి కి ఉపదేశించిన 112 ధ్యాన విధానాలు ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని నేరుగా పొందాలి, అనుకునే వారికి ఉపయోగ పడే దీపికలు. ముఖ్యంగా ఏకాగ్రతను, ధారణను అభ్యాసం చేసేవారు వీటినిఆచరించ వచ్చు. వారి వారి అభ్యాస తీవ్రతను బట్టి ఫలితాలు పొందవచ్చు.

వీటిలోని ఔన్నత్యం ఏమిటంటే ఎక్కడాదేవతల గురించి పూజల గురించి నమ్మకం గురించి చెప్పని కేవల జ్ఞాన సంబంధ మైన సాహిత్యం ఇది. ఈ ప్రక్రియచెయ్యి ఈ ఫలితం పొందు అని మాత్రమే చెబుతుంది. అందుకే పేరు కూడా చాలా సరిగ్గా *విజ్ఞాన భైరవ తంత్రం* అనిపెట్టారు. ఈ 112 అభ్యాసాలనూ వరుసగా చూద్దాం.
 

   ఈ విజ్ఞాన భైరవ తంత్రం వేదాంతపరము మరియు లోతైన ముక్తిపరమైన కాశ్మీర శైవానికి సంబంధించిన ప్రాచీన గ్రంథం. దీనికి ఎక్కడా తెలుగు బాషలో మూలం కానీ భావం కానీ లభ్యం కావట్లేదు. ఇందులో స్వయంగా ఈశ్వరుడు పార్వతికి *తంత్ర మార్గంలో* ధ్యాన పద్ధతులను ఉపదేశం చేస్తాడు.  *భైరవ తత్త్వం ఏమిటి?* అని...శివుణ్ణి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈశ్వరుడు *భైరవ తత్త్వం* ఆలోచనా పరిధికి అందేది కాదని వివరిస్తూ భైరవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు *112* విధాలైన ధ్యాన మార్గాలను వివరిస్తాడు. ఆ ధ్యానాల సమాహారమే ఈ *విజ్ఞాన భైరవ తంత్రం*. ఇందులో ధ్యానపద్ధతులన్నీ సంభవోపాయం (ఉన్నత జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి), శక్త్యోపాయం (కొంచెం జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి) మరియు ఆణవోపాయం (సామాన్య పద్ధతి)గా విభజించబడ్డాయి. సాధారణంగా శక్త్యోపాయం బాహ్య ప్రపంచంపై ఆధారపడేదిగాను, సంభవోపాయం పూర్తిగా అంతర్గతం మరియు నిరాధారంగానూ ఉంటాయి. కాశ్మీర శైవానికి మూలపురుషుడైనటువంటి అభినవగుప్తుడి ప్రకారం ఒక ఆధ్యాత్మికాభిలాషి తగినంత అవగాహన చేకూర్చుకుని సంభవోపాయాన్నే ఎంచుకోవాలి.


 విజ్ఞాన భైరవ తంత్రమన్నది *భైరవాగమము* నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞాన తంత్రము.
అనగా భౌతికములైన తంతులతో సంబంధము లేని, ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి.
నూట పన్నెండు పైగా ధారణా విధానములు దీనిలో ఉన్నవి.

దక్షిణ భారతము కంటే ఉత్తర, తూర్పు భారతమున ఈ తంత్ర ఉపాసకులు ఎక్కువగా మనకు కన్పిస్తూ ఉంటారు.
ముఖ్యముగా, కాశ్మీర శైవమునకు చెందిన త్రిక సాంప్రదాయులగు కౌలాచారులకు ఇది ప్రామాణిక గ్రంథము.

   ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు.
మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. ధారణా విధానములు సూటిగా బోధించుట ఈ తంత్రము ప్రత్యేకత.

తంత్ర మార్గమందు నడిచే ఇచ్చ ఉన్నవారు, సమర్ధుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క
లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించుచున్నట్టి అనుభవములను పొందగలుగుతారు.
 

 పూర్ణ భైరవ తత్వాన్ని ఆధ్యాత్మిక రూపాన్ని అవగాహన చేసుకోవాలంటే,  *"విజ్ఞాన భైరవ తంత్రం"* చదవాలి. ఇందులో అనేక రహస్యాలూ శూన్యానికి, ప్రణవానికి, యోగానికి వున్న సంబంధాలూ వున్నాయి. ఇందులో భైరవుడు యోగిగా, పరబ్రహ్మ తత్వంతో కనిపిస్తాడు. పతంజలి యోగసూత్రాలవంటి యోగ రహస్యాలని విశదీకరిస్తాడు.


  *యధాలోకేన దీపస్య* *కిరణౌర్భాస్కరస్య చ*
*జ్ఞాయతే దిగ్విభాగాది తద్వచ్చక్యా శివః ప్రియే*


సూర్యకిరణాలతో లోకం తేజోమయమై దర్శనీయమైనట్లు శివుడుకూడా (స్వ)శక్తి వల్ల దర్శనీయమౌతాడు. శక్తి పెరిగేకొద్ది శివానుభూతి అనుభవైకవేద్యమవుతుంది.


*ఓం నమః శివాయ*